- ‘రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ నిర్వహణ’పై ప్రాజెక్ట్ తయారీ
కాగజ్‌నగర్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలం భూపాలపట్నం యూపీఎస్ స్కూల్ స్టూడెంట్ అల్సా మమత రూపొందించిన ‘రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ నిర్వహణ’ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం నుంచి పేటెంట్ దక్కింది. మమత భూపాలపట్నం యూపీఎస్‌లో ఏడో తరగతి చదువుతున్న సమయంలో మ్యాథ్స్ టీచర్ మౌల్కరి కేశవ్, జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించింది.
ప్రాజెక్ట్‌ను పరిశీలించిన పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్‌మార్క్‌ల నియంత్రణాధికారి కార్యాలయం అధికారికంగా పేటెంట్ మంజూరు చేస్తూ మార్చి 30న ఆర్డర్స్ జారీ చేసింది. షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, అపార్ట్‌మెంట్లు, కార్యాలయాల్లో ఎదురయ్యే పార్కింగ్ సమస్యకు ఈ ప్రాజెక్ట్ పరిష్కారం చూపుతుందని జిల్లా సైన్స్ ఆఫీసర్ కటుకం మధుకర్ తెలిపారు.
ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందించిన పరికరంలో ఉండే సెన్సార్ రద్దీ సమయంలో పార్కింగ్ స్లాట్ ఖాళీగా ఉందా ? లేదా ? అనే విషయాన్ని గుర్తించి డిస్‌ప్లేలో చూపిస్తుందని చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలోని స్కూళ్ల నుంచి పేటెంట్ పొందిన మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. మమత ప్రస్తుతం కౌటాల కేజీబీవీలో ఎనిమిదో తరగతి చదువుతోంది. స్టూడెంట్‌ను పలువురు టీచర్లు అభినందించారు.
